||సుందరకాండ ||

||ఇరువది తొమ్మిదవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ త్రింశస్సర్గః

శింశుపా వృక్షములో దాగి వున్న హనుమంతుడు, రాక్షసస్త్రీలచేత సీత భయపెట్టబడడము , త్రిజట స్వప్న వృత్తాంతము అన్నీ యథాతథముగా వినెను. నందనవనములోని దేవతవలె నున్న ఆ సీతను చూచి ఆ వానరుడు పరిపరివిధములగా ఆలోచించసాగెను.

' ఏ సీత కొరకై వందలకొలదీ వేలకొలదీ వానరులు అన్ని దిశలలో వెదుకుతున్నరో అట్టి సీతను నేను చూచితిని. గూఢచారిలాగ తిరుగుతూ యుక్తితో శత్రువుల శక్తిని చూచి ఇది అంతా అవగాహన చేసుకున్నాను. రాక్షసులగురించి, విశేషముగా ఈ నగరముగురించి, ఈ రాక్షసాధిపతి రావణునియొక్క ప్రభావము కూడా చూచితిని. అన్ని ప్రాణులపై దయకలవాడు, అప్రమేయుడు అయిన ఆ పతి దర్శనము కోరుకొనుచున్న ఆ భార్యను ఊరడించడము యుక్తము'.

' ఈ పూర్ణచంద్రుని బోలు ముఖము కల , ఎప్పుడూ దుఃఖములను ఎరుగని, ఇప్పుడు దుఃఖముల అంతము కానరాక అతి దుఃఖములో నున్న ఆమెకి ఆశ్వాసమిచ్చెదను. ఒకవేళ దుఃఖములో మునిగిఉన్న ఆ దేవికి ఆశ్వాసమివ్వకుండా వెళ్ళిపోయినచో అది పొరపాటు అవును. నేను అలా వెళ్ళిపోతే యశస్వినీ అగు రాజపుత్రి జానకి తనకు రక్షింపబడు మార్గము కానరాక జీవితమే త్యజించును'.

' పూర్ణచంద్రునిబోలిన మహాబాహువులు కల సీతను చూచుటకు తహతహలాడుతున్న రామునకు ఉపశమనము కలిగించుట న్యాయము. ఈ నిశాచరుల ముందర సంభాషణ మంచిదికాదు'.

'ఏమిటి నా కర్తవ్యము? నాకు ఏమీ తోచకున్నది. ఈ రాత్రి ఆమెకు ఆశ్వాసన ఇవ్వకపోతే ఆమె జీవితమును పరిత్యజించును. ఇందులో సందేహము లేదు. ఒకవేళ రాముడు నన్ను "నాకు సీతా ఏమి చెప్పినది" అని అడిగినచో ఆ సందరాంగితో మాట్లాడకూండా ఏమి సమాధానమిచ్చెదను. సీతాసందేశము లేకుండా ఇక్కడనుంచి త్వరగా వెళ్ళిన నన్ను ఆ కాకుత్‍స్థుడు తీవ్రమైన కన్నులతో దహించివేయును. రాముని కార్యము నెరవేర్చుటకు సుగ్రీవుని సైన్యముతో కూడా తీసుకువచ్చినచో ఆ పని వ్యర్థమగును'.

' నేను ఇక్కడ కూర్చుని రాక్షసుల అంతరాయములేకుండా సంతాపములో మునిగియున్న ఈమెకు మెల్లిగా ఆశ్వాసమిచ్చెదను. నేను సూక్ష్మరూపములో ఉన్నవాడిని. అందులోనూ వానరుడను. ఇప్పుడు సంస్కారముకల మనుష్యుల భాషలో మాట్లాడెదను. నేను ద్విజులుమాట్లాడే సంస్కృతములో మాట్లాడినచో నన్ను రావణుడా అనే శంకతో సీత భయపడును. ప్రత్యేకముగా వానరుడు ఇట్లు ఎలామాట్లాడును అని శంక కలుగును. అందువలన అవశ్యముగా మనుష్యులభాషలో అర్థవంతముగా మాట్లాడవలెను. లేకపోతే ఈమెను శాంతపరచుట సంభవము కాదు'.

'ముందే రాక్షసులతో భయపడిన ఈ సీత నా రూపము భాష చూచి మళ్ళీ భయపడును. అప్పుడు ఆ మనస్విని నన్ను కామరూపుడగు రావణుడు అని భావించి పెద్ద శబ్దము చేయును. సీత చేత చేయబడిన శబ్దముతో యమునిలా భయంకరముగా వున్న రాక్షసీ గణములు గుమిగూడెదరు. అప్పుడు ఆ వికృతాననలు చుట్టుముట్టి నన్ను బంధించుటకు కాని వధించుటకు గాని ప్రయత్నము చేసెదరు. మంచి కొమ్మలను మహావృక్షముల కొమ్మలనూ పట్టుకొని , చెట్లకొమ్మలమీద ఎగబ్రాకుతూ పరుగెడుతున్న నన్నుచూసి వారు భయ సందేహములు కలవారగుదురు. వికృతాననలు అగు రాక్షసులు వనములో విచరించు నా మహత్ రూపము చూచి భయపడిపోయెదరు'.

' అప్పుడు రాక్షసులు రాక్షసేంద్రుని వాసములో రాక్షసేంద్రుని చే నియుక్తులైన రాక్షస వీరులను కూడా ఆహ్వానించెదరు. అప్పుడు ఆ రాక్షసువీరులు శూలములు శక్తులూ ఖడ్గములూ అనేక ఆయుధములు చేతిలో పట్టుకొని ఉద్వేగముతో వేగముగా వచ్చెదరు. వారిచే చుట్టబడి వారి బలమును విరోధిస్తూ ఆ మహాసాగరము అవతలి తీరము చేరలేకపోవచ్చు. శీఘ్రముగా వెళ్ళు చాలామంది రాక్షసులు నన్ను బంధించవచ్చు. ఈమెకు సందేశము అందకపోవును. నేను కూడా బంధింపబడిన వాడగుదును. హింసలో రుచిగల వారు ఈ జనకాత్మజను హింసించెదరు. అప్పుడు రామ సుగ్రీవుల కార్యము విఫలము అగును'.

' జానకి బందీగా రాక్షసుల కాపలాలో సాగరముతో చుట్టబడి రహస్యమైన ప్రదేశములో ఉన్నది. నేను రాక్షసులతో జరిగిన యుద్ధములో మరణించినా పట్టుకో బడినా రామునికి సహాయము చేయగల వారు ఎవరూ లేరు. నేను చనిపోతే ఈ శతయోజన విస్తీర్ణము గల మహా సాగరము దాటగల వానరుడు నాకు కనపడుట లేదు. వేయిమంది రాక్షసులను హతమార్చుటకు నాకు సమర్థత ఉన్నది. కాని సంగ్రామము తరువాత ఆ మహాసాగరపు అవతలి తీరము చేరగల శక్తి ఉండకపోవచ్చు. యుద్ధములోని అనిశ్చితాలమీద నాకు ఇష్టము లేదు. ఏ ప్రజ్ఞాశాలి సంశయముతో కూడిన కార్యము తీసుకొనును?'

'మాటలాడక పోతే వైదేహి ప్రాణత్యాగము చేయవచ్చు. సీతదేవి తో మాట్లాడినా కూడా ప్రమాదము కలుగవచ్చ".

' దేశకాల విరోధములతో వివేకహీనుడైన దూతచే అర్థవంతమైన కార్యములు సూర్యోదయముచే నాశనము చేయబడిన చీకటిలాగా నాశనము అవును. అర్థము అనర్థము మధ్యలో నిశ్చయమైన బుద్ధి కూడా శోభించదు. తమని తాము పండితులము అనుకునే దూతలు కార్యములు అనర్థము చేయుదురు'.

'కార్యము ఎట్లు చెడకుండా ఉండాలి? బుద్ధిని ఎట్లు హీనముకాకుండా చేయగలము? సముద్ర లంఘనము ఎట్లు వృధాకాకూడదు? నామాటలవలన సీత ఎట్లు భయపడకుండావుండునట్లు చేయగలను" అని అలోచించి ఈ విధముగా నిర్ణయముకు వచ్చెను.

' ఎటువంటి క్లిష్టకర్మలైనా సాధించగల సమర్థుడు అగు రాముని కీర్తిస్తూ రాముని యందే లగ్నమైన మనస్సు గల ఈమెను భయపెట్టజాలను. ఇక్ష్వాకులలో వరిష్ఠుడు ఆత్మను ఎరిగినవాడు అగు రామునికి శుభవచనములను మధురమైనమాటల తో సమర్పించెదను. ఈ విధముగా ఆమెకు నాపట్ల విశ్వసమును పెంపొందించెదను'.

అప్పుడు మహానుభావుడైన ఆ హనుమంతుడు ఆ చెట్టు కొమ్మలమధ్యలో కూర్చుని అ జగత్పతి యొక్క భార్యని చూస్తూ మధురమైన వాక్యములతో ఈ విధముగా పలుకసాగెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పదియవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||